ఆమె 1970ల్లో పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా పనిచేసిన జుల్ఫీకర్ అలీ భుట్టో కుమార్తె. బెనజీర్ హార్వర్డ్, ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు, ఆక్స్ ఫర్డ్ యూనియన్ కు నాయకత్వం వహించిన తొలి ఆసియన్ మహిళగా నిలిచారు.[3] ఆమె తండ్రి ప్రభుత్వాన్ని కూలదోసిన 1977 నాటి సైనిక తిరుగుబాటు తర్వాత కుటుంబ సభ్యులతో సహా బెనజీర్ పలుమార్లు గృహనిర్బంధంలో జీవించాల్సి వచ్చింది. 1979లో ఆమె తండ్రిని ఉరితీశాకా బెనజీర్, తన తల్లి నుస్రత్ తో కలిసి గృహనిర్బంధంలో నుంచే ప్రజాస్వామ్యాన్ని పున: స్థాపించేందుకు ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1984లో బెనజీర్ కుటుంబంతో పాటుగా లండన్ ప్రవాసం వెళ్ళి 1988 వరకూ అక్కడే జీవించారు. తిరిగి వచ్చాకా బెనజీర్ పీపుల్స్ పార్టీని 1988 పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో గెలుపు వైపు నడిపించారు.[4]